Wednesday, 16 May 2012

Gabbar singh movie review..!

ఓ హీరోతో సినిమా తెరకె క్కించాలంటే ఆ దర్శకుడు పెద్ద మేధావి కావాల్సిన అవసరం లేదు. ఆ హీరోని అభిమానిస్తూ.. ఆ హీరో అభిమాని అయితే చాలు’ ఇది ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో చిరంజీవి అన్న మాటలు.. సరిగ్గా అదే అభిమానాన్ని గుండెల్లో దాచుకొని ‘గబ్బర్‌సింగ్’ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు హరీష్ శంకర్. గత పది సంవత్సరాల నుంచి సరైన విజయం లేక, విజయ దాహం తీరక ఎదురుచూస్తున్న పవన్‌కు, ఆయన అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని విజయాన్ని అందించాలనుకున్న ఈ యువ దర్శకుడికి తోడుగా నిలిచాడు నిర్మాత బండ్ల గణేష్. పవన్ నాకు ఓ వ్యసనం అంటూ తన అభిమానాన్ని వెల్లడించిన ఈ నిర్మాత పవన్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించేందుకు తన సినిమానే కరెక్ట్ అనుకున్నాడు. అందుకే బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా రూపొంది ఘన విజయం సాధించిన ‘దబాంగ్’ను పవన్‌తో ‘గబ్బర్‌సింగ్’ పేరిట నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా రీమేక్ చేశాడు. పవన్ అంటే ప్రాణం ఇచ్చే దర్శకుడు, నిర్మాత కలిసి చేసిన ఈ ప్రయత్నం ఎంత మేరకు ఫలించిందో తెలుసుకుందాం..!

కథ: కొండవీడు గ్రామంలో నివసించే ఓ రైస్‌మిల్ యజమాని (నాగినీడు) తన భార్య మరణంతో, భర్త మరణించి కొడుకు ఉన్న ఓ మహిళని (సుహాసిని) పెళ్ళి చేసుకుంటాడు. ఆమె కొడుకే వెంకటరత్నం నాయుడు (పవన్ కళ్యాణ్), మొదట్నుంచీ సవతి తండ్రి వివక్షని తట్టుకోలేక చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయి హాస్టల్‌లో వుండి చదువుకొని తన ఊరికే పోలీస్ అధికారిగా తిరిగి వస్తాడు వెంకటరత్నం నాయుడు. ‘షోలే’ చిత్రంలోని విలన్ పాత్రధారి అయిన ‘గబ్బర్‌సింగ్’ను ఆరాధించే వెంకటరత్నం నాయుడు తన పేరును ‘గబ్బర్‌సింగ్’గా మార్చుకుంటాడు. అంతేకాదు పోలీస్ అధికారిగా తనదైన ‘తిక్క’తో తనకున్న లెక్కతో పనిచేస్తుంటాడు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌ను గబ్బర్‌సింగ్ పోలీస్‌స్టేషన్‌గా పేరు మార్చేస్తాడు. ఇక అదే గ్రామంలో పేరుమోసిన రౌడీషిటర్ సిద్ధప్ప నాయుడు అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ అతన్ని ముప్పు తిప్పలు పెడుతుంటాడు గబ్బర్‌సింగ్. ఎమ్మెల్యే కావాలని కలలు కంటూ దానికోసం సిద్దప్ప నాయుడు చేసే దుశ్చర్యలను అడ్డుకుంటుంటాడు. ఇక గబ్బర్‌సింగ్‌ను అడ్డుతొలగించాలని సిద్ధప్ప నాయుడు వేసే ప్లాన్స్‌ను తిప్పికొట్టి తన శైలిలో రెచ్చిపోతుంటాడు గబ్బర్‌సింగ్. ఈ క్రమంలోనే భాగ్యలక్ష్మీ (శ్రుతిహాసన్)తో ప్రేమలో పడతాడు..! ఇక అడుగడుగునా తన ఆధిపత్యానికి అడ్డంకిగా తయారైన గబ్బర్‌సింగ్‌ను సిద్ధప్ప ఏం చేశాడు? భాగ్యలక్ష్మితో అతని ప్రేమ ఫలించిందా..? గబ్బర్‌సింగ్ సిద్ధప్పకు ఎలా బుద్ధి చెప్పాడు? అతని ఆగడాల నుంచి కొండవీడు ప్రజలను ఎలా రక్షించాడు? అనేది మిగిలిన కథాంశం.

‘ఖుషీ’ తర్వాత పవన్ ఫుల్ జోష్‌తో నటించిన సినిమా ఇది. అతని నటనే చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సెంటిమెంట్, వినోదం, యాక్షన్ ఇలా అన్నింట్లోనూ తనదైన శైలిలో నటించాడు. పవన్ స్టయిల్, గెటప్, నడకతీరు చూసి ఇక అభిమానులైతే థియేటర్స్‌లో పండగ చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత డాన్స్ మూమెంట్స్‌తో కూడా ప్రేక్షకులను అలరించాడు పవన్‌కళ్యాణ్. శృతిహాసన్ నటనలో ఇంకా ఓనమాలు దిద్దుకుంటున్న హీరోయిన్‌గా కనిపించింది. నాగినీడు, సుహాసిని తమ పాత్రల పరిధి మేరకు ఒదిగిపోయారు. పవన్ తర్వాత ఈ సినిమాకు ప్రాణం పెట్టింది మాత్రం దర్శకుడు హరీష్‌శంకర్ అని చెప్పుకోవాలి. పవన్‌కళ్యాణ్ వీరాభిమాని అయిన హరీష్ హీరో పవన్‌ను ఎలా చూపిస్తే అభిమానులు ఖుషీ అవుతారో అచ్చంగా అలాగే చూపించాడు. ముఖ్యంగా ఆయన రాసిన సంభాషణలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది’ ‘ట్రెండ్‌ని ఫాలో అవను, ట్రెండ్‌ను సెట్ చేస్తా’ వంటి సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ‘పాపులారిటీదేముంది పాసింగ్ క్లౌడ్స్ లాంటివి, నేను ఆకాశం లాంటి వాడ్ని, నాకు నేనే పోటీ, నాకు నాతోనే పోటీ అనే సంభాషణలు పవన్ నోట పలుకుతుంటే అభిమానులు థియేటర్స్‌లో క్లాప్స్ కొడుతున్నారు. ఈ సంభాషణలే మున్ముందు ఈ చిత్రానికి రిపీట్ ఆడియన్స్ వచ్చేలా చేస్తాయి. ఈ చిత్రానికి వున్న మరో బలం దేవిశ్రీప్రసాద్ అందించిన బాణీలు, నేపథ్య సంగీతం. సినిమా విడుదలకు ముందే పాటలు సూపర్‌హిట్ కావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అయితే పాటలను విజువల్‌గా మరింత బాగా తీసుంటే బాగుండనిపిస్తుంది. జయనన్ విన్సెంట్ ఛాయాగ్రహణం డీసెంట్‌గా వుంది. ఓవరాల్‌గా గబ్బర్‌సింగ్ పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహన్ని నింపింది. సమ్మర్ సీజన్ కావడంతో ఇక ‘గబ్బర్‌సింగ్’కు వసూళ్లకు అడ్డు వుండదని చెప్పొచ్చు.

2 comments:

ALL SITE LABLES